Goa Blast: గోవా బ్లాస్ట్.. 25కి చేరిన మృతుల సంఖ్య..

ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Update: 2025-12-07 04:15 GMT

గోవా రాష్ట్రం అర్పోరా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్-కమ్-నైట్ క్లబ్ అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సెకన్లలోనే, మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది, కస్టమర్లు పారిపోవడానికి సైతం అవకాశం లభించలేదు. ఎగసిపడుతున్న మంటలు మొత్తం ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయి. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇరవై ఐదు మందికి చేరింది. వీరిలో 22 మంది ఊపిరాడక, ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ సంఘటనను చాలా విషాదకరంగా అభివర్ణించారు. క్లబ్‌ల భద్రతా ఆడిట్‌ను డిమాండ్ చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్‌లో ఈ భయంకరమైన సంఘటన జరగడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

ఈ అంశంపై గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం గురించి రాత్రి 12:04 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని చెప్పారు. “పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీశాం. క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 25 మంది చనిపోయినట్లు నిర్ధారించాం. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.” అని వివరించారు.

 అగ్ని ప్రమాదంపై  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము , ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఘటనలో కొందరు మృతిచెందడం బాధకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News