Goa Politics : గోవాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..

Goa Politics : గోవాలో కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరడం తీవ్ర కలకలం రేపింది

Update: 2022-09-14 16:30 GMT

Goa Politics : గోవాలో కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరడం తీవ్ర కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ కోలుకోలేని దెబ్బతగిలింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించింది.

భారత్​ జోడో యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూడలేకే బీజేపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో జోరు పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. గోవాలో 8 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులు కమలదళంలో చేరడం.. బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్​ కీచడ్ లో భాగమని దుయ్యబట్టింది.

రాహుల్‌ గాంధీయాత్రను తక్కువ చేసి చూపేందుకు బీజేపీ అసత్య ప్రచారాలు సాగిస్తోందని కాంగ్రెస్ అంటోంది. అయినా.. మేము వెనక్కు తగ్గం. బీజేపీ కుయుక్తులు అన్నింటినీ అధిగమిస్తాం అంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. దేశాన్ని ఏకం చేసే ఈ సంక్లిష్టమైన ప్రయాణానికి మద్దతుగా నిలవలేని వారు, బీజేపీ బెదిరింపులకు భయపడేవారు.. విడగొట్టేవారివైపు వెళ్తున్నారని తెలిపింది.

గోవాలో 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు దక్కించుకుంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బీజేపీలో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో... ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వీరు తప్పించుకున్నట్లైంది. 

Tags:    

Similar News