GST 2.0 : జీఎస్టీ ఎఫెక్ట్.. కార్ సేల్స్ రెట్టింపు.. 5 లక్షల యూనిట్లకు చేరిన అమ్మకాలు.

Update: 2025-10-23 13:30 GMT

GST 2.0 : దేశీయ ఆటోమొబైల్ రంగానికి గుడ్ న్యూస్. సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 కారణంగా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. జీఎస్టీ కొత్త రేట్ల వల్ల కార్ల విక్రయాలు రెట్టింపు అయ్యాయని, దాదాపు 5 లక్షల యూనిట్ల మార్కును చేరుకున్నాయని ప్రకటించారు. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. దీపావళి వరకు మొత్తం వాహన పరిశ్రమ రిటైల్ అమ్మకాలు 6.50 లక్షల నుంచి 7 లక్షల యూనిట్ల మధ్య నమోదయ్యాయి.

సెప్టెంబర్ 22న ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ రేట్ల తగ్గింపుతో అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0, దేశీయ వాహన రంగానికి భారీ ఊతం ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత కార్ల అమ్మకాలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 5 లక్షల యూనిట్ల మార్కును చేరుకున్నాయని తెలిపారు.

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, జీఎస్టీ తగ్గింపు తర్వాత దీపావళి వరకు మొత్తం వాహన పరిశ్రమ రిటైల్ అమ్మకాలు 6.50 లక్షల నుంచి 7 లక్షల యూనిట్ల మధ్య నమోదయ్యాయి. ఈ-కామర్స్, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా డిమాండ్ భారీగా పెరిగిందని, ముఖ్యంగా ప్రీమియం ఉత్పత్తులు, తక్షణ డెలివరీ సేవలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగల డిమాండ్ కారణంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటార్స్ సంస్థ, నవరాత్రి నుండి దీపావళి వరకు గత 30 రోజుల్లోనే లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. ఈ కాలంలో టాటా మోటార్స్ అమ్మకాలలో ఏకంగా 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎస్‌యూవీ విభాగంలో టాటా ఆధిపత్యం కొనసాగింది. మారుతి సుజుకి ఇండియా కూడా జీఎస్టీ రేట్ల తగ్గింపు, దేశీయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా వృద్ధిని సాధించింది.

పండుగల సందర్భంగా పెరిగిన ఈ వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలను అందించింది. కార్లు, ఎస్‌యూవీలతో సహా ప్యాసింజర్ వాహనాల విభాగంలో కేవలం దీపావళి అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.6.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీపావళి సమయంలో వ్యాపారం ఊపందుకోవడం వలన లాజిస్టిక్స్, రవాణా, ప్యాకేజింగ్, డెలివరీ వంటి అనుబంధ రంగాలలో దాదాపు 50 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభించినట్లు అంచనా.

Tags:    

Similar News