Defamation case: రాహుల్ కి గట్టి ఎదురు దెబ్బ
పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టులోనూ దక్కని ఊరట;
రాహుల్ గాంధీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. పరువు నష్టం కేసులో శిక్ష నిలిపి వేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. క్రింది కోర్టు తీర్పునే సమర్పించింది. మోడీ పేరుతో చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించింది.
2019 ఎన్నికల సమయంలో రాహుల్ కర్నాటకలో ప్రచారం చేస్తూ.. మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనా అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.
వెంటనే ఆయన సూరత్ కోర్టు తీర్పును జిల్లా కోర్టులో సవాల్ చేశారు. కానీ అక్కడ కూడా ఊరట లభించలేదు. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఆయన అభ్యర్ధనను మన్నించలేదు. జైలుశిక్షపై స్టే ఇచ్చేందుకు ఎలాంటి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. అంతే కాదు రాహుల్ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని , వీర్ సావర్కర్ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసారు. ఆయనపై ఎనిమిది క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదై, విచారణలో ఉన్నాయని కోర్ట్ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఆయనను దోషిగా నిర్థరిస్తూ ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని, ఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇప్పుడు గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఏది ఏమైనా వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రాహుల్ గాంధీకి ఈ కేసు సమస్యగా మారినట్టే కనిపిస్తోంది.