అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విషాద ఘటనకు సంబంధించి ఓ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టేకాఫ్ తర్వాత క్రమంగా విమానం కిందకు దిగుతూ కుప్పకూలిన దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. అయితే, ఈ వీడియోను స్థానికంగా ఉండే ఓ 17 ఏళ్ల కుర్రాడు చిత్రీకరించినట్లు తెలిసింది. ప్రమాద కేసు దర్యాప్తు చేస్తున్న స్థానిక క్రైం బ్రాంచ్ పోలీసులు.. బాలుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నట్లు చెప్పారు.
ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఆర్యన్ (17) అనే కుర్రాడి కుటుంబం అద్దెకు ఉంటోంది. విమానాలు టేకాఫ్ అవుతున్న వీడియోలు చిత్రీకరించడం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే జూన్ 12న వీడియోలు తీస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్యన్ మీడియాకు వెల్లడించాడు. ‘‘వీడియో రికార్డు మొదలుపెట్టిన 14 సెకన్లకే విమానం కుప్పకూలింది. ఆ ఘటనను కళ్లారా చూసి ఎంతో భయపడ్డా. ఈ వీడియోను మొట్టమొదట నా సోదరి చూసి నాన్నకు చెప్పింది. ఆ విమానం కూలిపోతుందనే విషయం నాకు తెలియదు’’ అని ఆర్యన్ చెప్పాడు. ఆ ఘటన అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉండకూడదని ఆర్యన్ అనుకున్నాడని, భయంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడని ఆర్యన్ సోదరి వెల్లడించారు. ఆ రాత్రంతా మెల్కొనే ఉన్నాడని, ఏమీ తినకుండా మౌనంగా ఉండిపోయాడని ఆ ఇంటి యజమాని వివరించారు.