Gulam Nabi Azad : 50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకున్న గులామ్ నబీ ఆజాద్.. ముఖ్య కారణం అతనే..

Gulam Nabi Azad : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.;

Update: 2022-08-26 07:15 GMT

Gulam Nabi Azad : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారును ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మూల స్థంభాల్లో ఒకరిగా ఉన్న వెటరన్‌ నేత గులాం నబీ ఆజాద్‌... కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. అన్ని రకాల పదవులకు రాజీనామా చేశారు. తాను ఇకపై ఈ పార్టీలో ఉండలేనంటూ తేల్చి చెప్పేశారు.

కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై ఆజాద్ అసంతృప్తిగా ఉన్నారు. అధ్యక్షుని ఎన్నిక విషయంలోనూ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. రాజీనామా లేఖలోనూ తన అసంతృప్తిని గులాం నబీ వెళ్లగక్కారు. ముఖ్యంగా పార్టీ ఆశాకిరణంగా భావిస్తున్న రాహుల్‌ గాంధీనే ఆయన టార్గెట్‌ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్‌కు రాజకీయ పరిపక్వత లేదంటూ ఆజాద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాకనే పార్టీ నాశనం అయిందంటూ మండిపడ్డారు

కాంగ్రెస్ పార్టీకి కొంతకాలంగా వరుస షాకులు తగులుతున్నాయి. పలువురు నాయకులు వరుసగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండేళ్లుగా పార్టీ అధినాయకత్వంపై ఆజాద్‌ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి పలుసార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆజాద్.. తాజాగా రాహుల్ గాంధీ తీరును కూడా తప్పుబట్టారు.

రాహుల్‌ సీనియర్‌ నాయకుల మాటలు వినకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన అపరిపక్వ నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతున్నట్లు విమర్శించారు. గతంలో నాయకులందరూ ఎంతో సమన్వయంతో పనిచేసేవారని… సీనియర్లు ఇచ్చిన సిఫార్సులకు ఎంతో విలువ ఉండేదని… ఇప్పుడు కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితే లేకుండా పోయిందని ఆజాద్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుందంటూ ఆజాద్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మొత్తం ఐదు పేజీల లేఖను సోనియాకు పంపించారు.

Tags:    

Similar News