Gurgaon CEO: లవర్ తో బ్రేకప్.. లీవ్ కోసం సీఈవోకు ఉద్యోగి మెయిల్
తను అందుకున్న అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు ఇదేనన్న సీఈవో
అనారోగ్యం వల్లో లేక వ్యక్తిగత పనుల కోసమో సెలవు పెట్టడం సర్వ సాధారణం.. క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని సెలవు చీటీ పంపే ఉద్యోగులూ కోకొల్లలు. అయితే, ఓ ఉద్యోగి మాత్రం ప్రియురాలితో తనకు బ్రేకప్ అయిందని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు సెలవు కావాలని కంపెనీ సీఈవోకు మెయిల్ చేశాడు.
ఈ ఈమెయిల్ ను అందుకున్న సీఈవో ఆశ్చర్యపోయాడు. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘తన వృత్తి జీవితంలో అందుకున్న అత్యంత నిజాయితీ గల సెలవు దరఖాస్తు ఇదే’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టు కాస్తా వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. నాట్ డేటింగ్ అనే సంస్థ సీఈవో జస్వీర్ సింగ్ ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన సెలవు దరఖాస్తును అందుకున్నారు.
తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు బ్రేకప్ అయ్యిందని, ఆ బాధలో పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని మెయిల్ చేశాడు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని కోరాడు. దీనిపై జస్వీర్ సింగ్ స్పందిస్తూ.. జెన్ జెడ్ తరం ఉద్యోగులు తమ మనసులో ఏమీ దాచుకోరని మెచ్చుకున్నారు. తమ భావోద్వేగాలు, మానసిక సమస్యలు వంటి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారని చెప్పారు.
ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంతకీ ఆ ఉద్యోగికి సెలవు ఇచ్చారా లేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. జస్వీర్ సింగ్ స్పందించాడు. మెయిల్ చదివిన మరుక్షణమే లీవ్ మంజూరు చేశానని బదులిచ్చారు.