Nafe Singh Rathee: ఐఎన్‌ఎల్డీ హర్యానా చీఫ్‌పై కాల్పులు
బులెట్ల గాయాలతో నఫే సింగ్ రాఠీ అక్కడికక్కడే మృతి;
హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠి దారుణ హత్యకు గురయ్యారు. మరో ముగ్గురితో కలిసి ఆయన కారులో వెళ్లుతుండగా బహిరంగంగానే కొందరు వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. వారిని సమీప హాస్పిటల్ తరలించగా.. అప్పటికే మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠి మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరొకరు స్పాట్‌లోనే మరణించారు. ఇంకో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది.
రాఠి మరికొందరితో కారులో వెళ్లుతుండగా జాజ్జర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాఠి ఎస్‌యూవీలో ఉండగా.. అక్కడికి మరో కారు వచ్చింది. అందులో నుంచి కొందరు దుండగులు తుపాకులు తీసి ఆ ఎస్‌యూవీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హర్యానా ఐఎన్ఎల్డీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠి హతమయ్యారు. ఆయనతోపాటే ఉన్న మరో వ్యక్తి మరణించారు. ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
బహదూర్‌గఢ్‌లోని బరాహి గేట్ సమీపంలో హ్యుందాయ్ ఐ10 లో కారులో వేచి ఉన్న షూటర్లు.. నఫే సింగ్ రాథీ ప్రయాణిస్తున్న కారుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో నఫే సింగ్ రాథీతోపాటు ఆ కారులో ఉన్న మరో ఇద్దరు నాయకులు మృతి చెందారు. ఇక అదే కారులో ఉన్న ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. నఫే సింగ్ రాథీపై జరిగిన కాల్పుల సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నఫే సింగ్ రాథీ కారుకు అనేక బుల్లెట్ల రంధ్రాలు ఉన్నాయని.. దుండగులు భారీగా కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోని నఫే సింగ్ రాథీని కాల్చి చంపిన హంతకులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ టీమ్‌లు ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు దుండగులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితులు కాలా జాతేడీ ఈ దాడి వెనక ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగదాల కారణంగానే ఈ కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హర్యానా అసెంబ్లీకి రెండుసార్లు నఫే సింగ్ రాథీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హర్యానా లెజిస్లేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.