Madhya Pradesh :నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి..
బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్ బోర్డు బంపర్ ఆఫర్;
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. నలుగురు పిల్లలను కనాలని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువ జంటలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ఛైర్మన్ పండిట్ విష్ణు రాజోరియా రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ప్రభుత్వ హయాంలో నడుస్తోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మనం కుటుంబాలను పట్టించుకోవడం మానేసినందున మతోన్మాదుల సంఖ్య పెరుగుతోంది. యువతరం నుంచి నాకు చాలా అంచనాలున్నాయి. వృద్ధుల నుంచి మనం పెద్దగా ఆశించలేం. జాగ్రత్తగా వినండి.. భవిష్యత్ తరాల భద్రత మీ బాధ్యత. యువకులు ఒక బిడ్డను కని స్థిరపడుతున్నారు. రాను రాను ఇది చాలా సమస్యగా మారే అవకాశం ఉంది. కనీసం నలుగురు పిల్లలను కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.” అని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత పరశురామ్ బోర్డు నలుగురు పిల్లలు ఉన్న దంపతులకు లక్ష రూపాయల రివార్డు ఇస్తుందని ఆయన ప్రకటించారు.