Haryana: రీల్స్ వద్దంటే వినలేదని టెన్నిస్ ప్లేయర్ను కాల్చి చంపిన తండ్రి
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన;
టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25) దారుణ హత్యకు గురయ్యింది. రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఇంట్లోనే కాల్చి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం (జూలై 10) జరిగింది. అతి సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరపడంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. నిందితుడు దీపక్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన హర్యానాకు చెందిన రాధిక యాదవ్ గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్ 2లోని జి బ్లాక్‌లో ఫ్యామిలీతో కలిసి ఉంటోంది. ఇటీవల రాధిక ఆటపై దృష్టి పెట్టకుండా ఎక్కువగా ఇన్స్ స్టా గ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. రోజురోజుకు రీల్స్ పిచ్చి ముదరడంతో ఆగ్రహించిన రాధిక తండ్రి రీల్స్ చేయొద్దని.. ఆటపై ఫోకస్ చేయాలని హెచ్చరించాడు.
తండ్రి పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాధిక తీరు మార్చుకోకుండా అలాగే రీల్స్ చేస్తుండటంతో దీపక్ యాదవ్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన దీపక్ యాదవ్ గురువారం (జూలై 10) ఇంట్లో ఉన్న కూతురు రాధికను కాల్చి చంపాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. రాధిక తండ్రి దీపక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. రాధిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రీల్స్ మోజులో పడిందనే కోపంతోనే రాధికను తండ్రి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.