Narendra Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం వెనక ఉగ్రవాదుల హస్తాన్ని తోసిపుచ్చలేం: సొలిసిటర్ జనరల్

Narendra Modi: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

Update: 2022-01-07 15:57 GMT

Narendra Modi: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాని భద్రతా ఏర్పాట్ల వ్యవహారం కాక పుట్టిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతా లోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డులు సుప్రీంకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దర్యాప్తులో చండీగఢ్ డైరెక్టర్ జనరల్, నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారి ఇద్దరూ నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. దర్యాప్తుకు పంజాబ్ ప్రభుత్వం, పోలీస్ అధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సహకరించాలని ఉత్తర్వులిచ్చింది. ప్రధాని మోదీ భద్రతకు భంగం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. ప్రధానికి భద్రతా వైఫల్యం వెనక ఉగ్రవాదుల హస్తాన్ని తోసిపుచ్చలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్రం కమిటీ వేసిందని, రాష్ర్టాలకు నోటీసులు జారీ చేశామని అటార్నీ జనరల్ వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు.

అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించడంతో పాటు.. తాము ఆందోళనపడుతున్న విషయాలను కూడా కోర్టుకు వివరిస్తామన్నారు. విచారణను సోమవారం వరకు వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఇటు పంజాబ్‌ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వాదించింది. భద్రతా వైఫల్యం విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని పంజాబ్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

ఎక్కడో లోపం జరిగిందని, ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీ వేశామని, విచారణ జరుగుతోందని కోర్టుకు తెలిపారు. లోపం ఎవరి వైపు నుంచి జరిగింది..? స్పెషల్ ప్రొటక్షన్ గ్రూపు వైపు నుంచా లేక పంజాబ్ పోలీసులదా అనేది తేలుతుందని వివరించారు.

Tags:    

Similar News