Delhi: ఢిల్లీని హడలెత్తించిన భారీ వర్షం-100 విమానాలు ఆలస్యం
గంటకు 70-80 కి.మీ. గాలులు వస్తాయని ఐఎండీ హెచ్చరిక;
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్‌సీఆర్) ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భీకర వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రతికూల వాతావరణం వల్ల 40కి పైగా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని, దాదాపు 100 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మీదుగా దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గంటకు 74 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పాలం వాతావరణ కేంద్రంలో నమోదైంది. ప్రగతి మైదాన్ వద్ద ఉదయం 5:30 నుంచి 5:50 గంటల మధ్య అత్యధికంగా గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నీట మునిగిన ప్రాంతాలు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 8:30 గంటల వరకు ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది. ఆకస్మిక వర్షం కారణంగా లజ్‌పత్‌నగర్, ఆర్‌కేపురం, ద్వారక వంటి అనేక కీలక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ప్రయాణాలు మానుకోండి
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు తమ విమాన సర్వీసుల వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా సూచించారు. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కూడా ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశాయి. వాతావరణం కుదుటపడే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు మూసి ఉంచాలని, ప్రయాణాలు మానుకోవాలని ఐఎండీ సూచించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడినట్టు సమాచారం. ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా విమాన కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఎయిర్ ఇండియా తెలిపింది.