Himachal: హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం..

63 మంది మృతి.. రూ.400 కోట్ల నష్టం;

Update: 2025-07-04 06:30 GMT

హిమాచల్‌ప్రదేశ్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. గత కొద్ది రోజులుగా ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. ఓ వైపు కుండపోత వర్షాలు.. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 63 మంది చనిపోగా.. రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డజన్ల కొద్దీ గల్లంతయ్యారు.

గత కొద్ది రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు కారణంగా మేఘాలు రాష్ట్రాన్ని కమ్ముకున్నాయి. అంతేకాకుండా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇంకోవైపు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు 63 మంది చనిపోగా… పదుల కొద్దీ గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక జూలై 7 వరకు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రూ.400 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. మండి జిల్లాలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

రుతుపవనాలు జూన్ 20న హిమాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. తాజా సమాచారం ప్రకారం మండి జిల్లాలో 40 మంది మరణించగా, కాంగ్రాలో 13 మంది, చంబాలో ఆరుగురు, సిమ్లాలో ఐదుగురు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 14 వంతెనలు కొట్టుకుపోయాయి. 300 పశువులు చనిపోయాయి. ఇక విద్యుత్ సబ్‌స్టేషన్లు దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. నీరు, ఆహారం కొరత కూడా ఏర్పడింది.

Tags:    

Similar News