Mumbai: ముంబైను ముంచెత్తిన భారీ వర్షం.. ఇద్దరు మృతి
మరో ఇద్దరు మృతి.. ఇద్దరికి గాయాలు;
ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి మట్టి, రాళ్లు గుడిసెపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక క్షతగాత్రులను రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇక అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను పోలీస్ శాఖ కోరింది. ఇక ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ నెంబర్లు 100 / 112 / 103కు చేసి సహాయ పొందాలని కోరారు.
ముంబై వాసులు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. ఏదైనా అవసరం అయితే సహాయం కోసం ప్రధాన కంట్రోల్ రూమ్ 1916ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.