Cyclone Montha : మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం..
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
మొంథా తుఫాను ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడనంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెన్నైలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెన్నైతోపాటూ చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కన్యాకుమారి, తెంకాసి, తిరునల్వేలి, తిరువన్నమలై, వెల్లూరు, విలుప్పురంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌ల వద్ద కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది.