Mumbai Rains: 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షం..

ముంబయిని వణికించిన వరుణుడు;

Update: 2024-07-08 04:45 GMT

దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ర్ట పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాలు సైతం నీటమునిగాయి. ముఖ్యంగా ముంబైలో రోడ్లపై ఎటుచూసినా వరదనీరు ప్రవహిస్తోంది. జనజీవనం స్తంభించింది. ముంబైకర్ల జీవనాడిగా పేర్కొనే లోకల్ రైళ్లు సైతం చాలా ప్రాంతాల్లో రద్దయ్యాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ లు సైతం నీట మునిగాయి.

ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 30 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది.

వర్షం కారణంగా ముంబయిలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్‌, కొంకణ్‌ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఇక నిన్న ఠాణెలోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్‌ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

Tags:    

Similar News