Delhi: ఢిల్లీలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి..

నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి కూలీలు మృతి;

Update: 2025-05-18 01:15 GMT

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శనివారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరవాసులు వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. అయితే.. వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రదేశం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.

ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలలో నిమగ్నమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుస్సేన్ ప్రమాదం గురించి సమాచారాన్ని పంచుకున్నారు. మృతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల్లో ఇద్దరు బీహార్‌, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారున్నారు. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన 65 ఏళ్ల ప్రభు, ముంగేర్‌కు చెందిన 40 ఏళ్ల నిరంజన మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన రోషన్ (35) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ..” సాయంత్రం 5:30 గంటలకు సమాచారం అందింది. నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయి కొంతమంది చనిపోయారని నాకు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఇంటి గోడ కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తాం. పహార్‌గంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన తరువాత, NDRF, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.”అని తెలిపారు.

Tags:    

Similar News