Bangalore Rains : బెంగళూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

Bangalore Rains : ఐటీ నగరి.. కర్ణాటక రాజధాని బెంగళూరు నిండా మునిగింది. భారీ వర్షాలు బెంగళూరును ముంచెత్తాయి.;

Update: 2022-09-05 10:45 GMT

Bangalore Rains : ఐటీ నగరి.. కర్ణాటక రాజధాని బెంగళూరు నిండా మునిగింది. భారీ వర్షాలు బెంగళూరును ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నీళ్లు.. ఎటు వెళ్లినా వరదలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రంతా ఎడితెరిపిలేని భారీ వర్షాలు నగరాన్ని కుదిపేస్తున్నాయి. కుండపోత వానలతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అనేక కాలనీలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమయానికి ఆఫీస్ కు చేరుకోలేక ఉద్యోగులు నరకయాతన పడ్డారు. కొన్ని చోట్ల బయట పార్క్‌ చేసిన బైక్‌లు కొట్టుకుపోయాయి.

బెంగళూరు నగరంలోని బెళ్లందురు, ఔటర్ రింగ్ రోడ్, BEML లేఅవుట్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రహదారి నీట మునిగింది. మార్తహళ్లి నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ రోడ్‌లోని ఎకో స్పేస్ ఏరియాలో రోడ్లపై నీరు చేరింది. మారతహళ్లి- సిల్క్‌బోర్డ్‌ జంక్షన్‌ రోడ్డు సమీపంలో వరద నీటిలో ఓ వ్యక్తి మునిగిపోయాడు. స్థానిక సెక్యూరిటీ గార్డులు అతనిని రక్షించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.

భారీ వర్షాల కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక అలర్ట్ అయింది. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 1533కు కాల్ చేయాలని సూచించింది.

హెల్ప్‌లైన్ నెంబర్ 2266 0000, వాట్సాప్ హెల్ప్‌లైన్ 94806 85700 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపింది. అటు వరద పరిస్థితులపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బెంగళూరు ఐటీ కారిడార్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తింది.

పలు కంపెనీ ఆఫీసుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని అమెజాన్‌, విప్రో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. వర్షం కారణంగా తమ కంపెనీలకు 225 కోట్ల నష్టం వచ్చిందని బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌.. సీఎం బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాసింది. ఐటీ కారిడార్‌కు జరిగిన నష్టంపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించింది. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9 వరకు ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. బెంగళూరులోనూ ఈ నెల 9 వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

శివమొగ్గ, ఉడుపి, కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రం లోపలికి వెళ్లకూడదని సూచించారు. 



Tags:    

Similar News