ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతాతో సహా ఇండియా కూటమి నేతలు హాజరుకానున్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి మంత్రుల విషయమై క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరనుంది. JMMకు ఆరు, కాంగ్రెస్‌కు 4, రాష్ట్రీయ జనతా దళ్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఇక, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని రామ్‌గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రాకు వెళ్లారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే పుట్టారు.
శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్‌ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపేయడంతో.. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఇక, గురువారం నుంచి రాష్ట్రంలో మన ప్రభుత్వం పని చేయబోతుందని ప్రకటించారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా నా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ సోరెన్ వారిని ఆహ్వానించారు.