ఈసారి రుతపవన సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే ఐఎండీ అంచనావేసింది. దేశంలో వర్షాలపైనే ఆధారపడ్డ అత్యధిక వ్యవసాయ ప్రాంతాలు కలిగిన కోర్ మాన్‌సూన్ జోన్‌లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని మహాపాత్ర సోమవారం తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఈ కోర్ జోన్ పరిధిలోకి వస్తాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని మహాపాత్ర వెల్లడించారు. మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నదని, ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
మరోవైపు రాబోయే 5 రోజుల్లో దేశవ్యాప్తంగా నెలవారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఇటు ఏపీలో రెమాల్ తుఫాన్ తీరం దాటడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని వివరించింది.
రెమాల్ తుఫాన్ పశ్చిమబెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి రాష్ట్రంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత జిల్లాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. వేలాది ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ నేపథ్యంలో 2 లక్షల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాన్ కారణంగా 2500 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, 27వేలకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌లో తుఫాన్ కారణంగా 10మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.