Uttarakhand : ఉత్తరాఖండ్‌లో స్కూల్ సమీపంలో భారీగా జిలెటిన్ స్టిక్స్
అల్మోరా జిల్లాలో 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. అల్మోరా జిల్లా సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ పక్కన పొదల్లో 161 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 20 కిలోలకు పైగా బరువున్న ఈ పేలుడు పదార్థాలు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పాఠశాల ప్రిన్సిపాల్ సుభాష్ సింగ్ మొదటగా పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్లను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రెండు పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల నుంచి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను కూడా రప్పించారు.
డాగ్ స్క్వాడ్ జరిపిన గాలింపులో పొదల్లో కొన్ని జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు లభించగా, మరికొన్ని 20 అడుగుల దూరంలో దొరికాయి. మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్‌ను బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సురక్షితంగా సీల్ చేసి భద్రపరిచారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) దేవేంద్ర పించా ధ్రువీకరించారు. "దబారా గ్రామ పాఠశాల దగ్గర పొదల్లో 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నాం. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాం" అని ఆయన తెలిపారు.
సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. లోతైన విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్‌పి వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, హరియాణాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే.