Tamil Nadu: ఆత్మహత్యాయత్నాన్ని పసిగట్టి ఎలుకల మందు డెలివరీకి నిరాకరణ ... డెలివరీ బాయ్‌పై ప్రశంసల వర్షం
మహిళతో మాట్లాడి ఆర్డర్ రద్దు చేయించి ప్రాణం కాపాడిన వైనం
విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న ఓ డెలివరీ ఏజెంట్, చాకచక్యంగా వ్యవహరించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ డెలివరీ ఏజెంట్ సమయస్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి అర్ధరాత్రి సమయంలో ఒక మహిళ నుంచి ఎలుకల మందు కోసం ఆర్డర్ వచ్చింది. డెలివరీ అడ్రస్ నిర్ధారించుకునేందుకు ఆమెకు ఫోన్ చేయగా, అవతలి నుంచి ఏడుపు గొంతు వినిపించింది. దీంతో అతనికి అనుమానం కలిగింది. లొకేషన్‌కు చేరుకున్న తర్వాత, ఆ మహిళ తీవ్ర మనస్తాపంతో ఉండటాన్ని గమనించాడు. ఆమె ఆర్డర్ చేసిన మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఇవ్వడానికి నిరాకరించాడు
ఆమెను నేరుగా ప్రశ్నిస్తూ, "మీకు ఎన్ని కష్టాలున్నా దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఆత్మహత్య చేసుకోవడానికే ఇది ఆర్డర్ చేశారా?" అని అడిగాడు. ఆమె కాదని చెప్పినా, అతను నమ్మలేదు. "మీరు అబద్ధం చెబుతున్నారు. నిజంగా ఎలుకల కోసమే అయితే, సాయంత్రం గానీ, మరుసటి రోజు ఉదయం గానీ ఆర్డర్ చేసేవారు. అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ చేస్తారు?" అని ప్రశ్నించి, ఆమెతో మాట్లాడి ఒప్పించాడు. చివరకు, ఆమె తన ఆర్డర్‌ను రద్దు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత ఆ డెలివరీ ఏజెంట్ మాట్లాడుతూ, "ఈరోజు నా జీవితంలో ఏదో మంచి చేశాననే తృప్తి కలిగింది" అని ఓ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. "విధి కన్నా మానవత్వమే గొప్ప", "నిజమైన హీరోలు ఇలానే ఉంటారు", "పచ్చ జాకెట్‌లో వచ్చిన దేవదూత" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.