Human Sacrifice: నానమ్మని చంపి, రక్తంతో శివలింగానికి అభిషేకం..
ఛత్తీస్‌గఢ్‌లో నరబలి..;
ఈ కాలంలోనూ ఇంకా మూఢ నమ్మకాలతో కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. క్షుద్రపూజలు, నరబలులు వంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడు గుడ్డి నమ్మకంతో తన నానమ్మనే బలిచ్చాడు. ఆమెను చంపి, ఆ రక్తంతో శివలింగాన్ని అభిషేకించాడు. అనంతరం తనను తాను అదే త్రిశూలంతో పొడుచుకుని ఆత్మార్పణం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో నన్‌కట్టి గ్రామానికి చెందిన గుల్షన్ గోస్వామి(30) తన నానమ్మ రుక్మిణి గోస్వామి (70)తో కలిసి ఉంటున్నాడు. గ్రామంలోని శివాలయానికి దగ్గరలో ఉండే ఇంటిలో ఉండే గోస్వామి.. శివుడికి పరమ భక్తుడు. ప్రతిరోజూ శివాలయంలో పూజలు చేసే గోస్వామి.. మూఢ నమ్మకంతో ఘాతుకానికి పాల్పడ్డాడు.
శనివారం సాయంత్రం తన నానమ్మను త్రిశూలంతో పొడిచి చంపాడు. అనంతరం శివాలయానికి వెళ్లి ఆమె రక్తంతో శివలింగానికి అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చి అదే త్రిశూలంతో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి... అతడ్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న గుల్షన్‌ను చికిత్స కోసం రాయిపూర్‌లోని ఎయిమ్స్ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.