Bengaluru Doctor: నీ కోసం నా భార్యను చంపా.. లవర్‌కు మెసేజ్ చేసిన బెంగుళూరు డాక్టర్
భార్యను చంపేశాక డిజిటల్ పేమెంట్ యాప్ లో ప్రియురాలికి సందేశం
బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. ఏప్రిల్ 21 న కృతికా రెడ్డి మరణించగా.. అనారోగ్యంతో చనిపోయిందని ఆమె భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. వైద్య పరీక్షల్లో మత్తు మందు ఓవర్ డోస్ వల్లే చనిపోయిందని తేలడంతో కృతికా రెడ్డిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు నెలల తర్వాత కృతికా రెడ్డిని ఆమె భర్త మహేంద్రారెడ్డి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 15న మహేంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
అనారోగ్యానికి గురైన కృతికారెడ్డికి ఇంట్లోనే చికిత్స అందించిన మహేంద్రారెడ్డి.. ఓ మత్తుమందును అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. దీంతో కృతికా రెడ్డి మరణించింది. కృతిక చనిపోయిందని నిర్ధారించుకున్న డాక్టర్ మహేంద్ర తన ప్రియురాలికి మెసేజ్ చేశాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశాను’ అంటూ ఓ డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. వాట్సాప్, మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తే పోలీసులకు దొరికిపోతానని అతితెలివిగా డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిపై మహేంద్రా రెడ్డి ప్రియురాలిని ప్రశ్నించి, ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.