Rawalpindi: ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వార్తలు.. రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత
ఇస్లామాబాద్‌లో సైతం భద్రత కట్టుదిట్టం
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి లోని అదియాలా జైలు లో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లు కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, నిఘా సంస్థ ఐఎస్‌ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసినట్లు బలూచిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.
అయితే ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఇస్లామాబాద్ , రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు.
రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల, ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల నిరసనలు చేపట్టేందుకు ఇమ్రాన్ మద్దతుదారులు రెడీ అయ్యారు. పీటీఐ పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రెండు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు నగరాల్లో సెక్షన్ 144 విధించారు. అంతేకాదు ప్రజా భద్రత దృష్ట్యా బుధవారం వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.