Portable Hospital: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌ పారాడ్రాప్‌

15 వేల అడుగుల ఎత్తు నుంచి..;

Update: 2024-08-18 02:00 GMT

భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్‌ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్‌ క్యూబ్‌’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్‌ ట్రామాకేర్‌ క్యూబ్‌లను భీష్మ(భారత్‌ హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హిత అండ్‌ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది.

మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్‌ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్‌ హెర్క్యులస్‌ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్‌ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్‌ డ్రాప్‌ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. 


Tags:    

Similar News