India-Pakistan: యూఎన్‌లో పాక్ ఉపాన్యాసంపై భారత్ ధ్వజం
ఐరాసలో పాకిస్థాన్ బండారం బయటపెట్టిన భారత్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం జరిపిన ‘సామూహిక అత్యాచార మారణహోమం’ గురించి గుర్తుచేసి దాని నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది.
భద్రతా మండలిలో సోమవారం 'మహిళలు, శాంతి, భద్రత' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ అనూహ్యంగా కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్, పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"1971లో 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో తమ సొంత సైన్యంతోనే సుమారు 4 లక్షల మంది మహిళలపై క్రమపద్ధతిలో సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దేశం పాకిస్థాన్. సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ, జాతి నిర్మూలనకు పాల్పడే దేశం, ఇలాంటి కట్టుకథలతో, అతిశయోక్తులతో ప్రపంచ దృష్టిని మళ్లించాలని చూస్తోంది" అని హరీశ్ అన్నారు. పాకిస్థాన్ వాదనలు పూర్తిగా భ్రమలతో కూడినవని, వారి ప్రచారాన్ని ప్రపంచం గమనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ప్రతి అంశంలోనూ కశ్మీర్‌ను ప్రస్తావిస్తున్నా, ఏ దేశం కూడా వారి వాదనను పట్టించుకోవడం లేదని హరీశ్ తెలిపారు. గత వారంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సంస్కరణలు కోరుతూ నిరసన తెలిపిన 12 మందిని పాక్ భద్రతా దళాలు దారుణంగా చంపాయని ఆయన గుర్తుచేశారు.
అనంతరం శాంతిస్థాపనలో భారత పాత్రను హరీశ్ వివరించారు. భద్రతా మండలి తీర్మానం రాకముందే, కొన్ని దశాబ్దాల క్రితమే భారత్ ఈ సూత్రాలకు కట్టుబడి ఉందని అన్నారు. "1960లో కాంగోలో జరిగిన ఐరాస శాంతి ఆపరేషన్లలో భారత మహిళా వైద్య అధికారులు పాల్గొన్నారు. 2007లో లైబీరియాలో మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా పోలీస్ యూనిట్‌ను పంపిన ఘనత కూడా భారత్‌దే. ఆ యూనిట్ అక్కడి స్థానిక మహిళల్లో స్ఫూర్తి నింపి, వారు కూడా శాంతి నిర్మాణంలో భాగస్వాములయ్యేలా చేసింది" అని ఆయన వివరించారు.
"శాంతిస్థాపనలో మహిళలు పాల్గొనగలరా? అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. మహిళలు లేకుండా శాంతిస్థాపన సాధ్యమా? అన్నదే అసలు ప్రశ్న" అని హరీశ్ గట్టిగా చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్‌కీపింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మహిళా సైనికాధికారులకు భారత్ శిక్షణ ఇస్తోందని ఆయన తెలిపారు.