India-Pakistan: పాక్‌ ఎయిర్‌లైన్లకు భారత గగనతలం మూసివేత..?

దాయాదికి మరో షాక్‌..;

Update: 2025-04-29 06:45 GMT

పెహల్‌గామ్‌ ఉగ్రదాడితో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.

వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు బ్యాన్‌, పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్ల నిషేధం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌ విమానాలకు  భారత గగనతలం  మూసివేత దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌కు చెందిన విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే.. కౌలాలంపూర్‌ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు చేరుకునే పాక్‌ విమానాలు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, భారత ఓడరేవుల్లోకి పాకిస్థాన్‌ నౌకలు రాకుండా నిషేధం విధించే దిశగా కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇక పెహల్‌గామ్‌ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని పాకిస్థాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News