REPUBLIC DAY: గణతంత్ర వేడుకలను నడిపించిన నారీ శక్తి
ఆసేతు హిమాచలం గర్వపడేలా గణతంత్ర వేడుకలు... అబ్బురపరిచిన సాహసకృత్యాలు;
ఆసేతు హిమాచలం గర్వపడేలా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ పతాకం ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ హాజరయ్యారు. దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, మహిళా సాధికారతనుచాటుతూ సైనిక పరేడ్ సాగింది. ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగేలా విజయ్ చౌక్ నుంచి కర్తవ్యపథ్ వరకూ సాగిన పరేడ్ కనువిందు చేసింది. గత వేడుకల మాదిరిగానే ఈసారి నారిశక్తికి.. పెద్దపీట వేశారు. తొలుత వంద మంది మహిళా కళాకారులు ఆవాహన కార్యక్రమంతో కర్తవ్యపథ్‌లో పరేడ్‌ను మొదలు పెట్టారు. ఈసారి సంప్రదాయ మిలటరీ బ్యాండ్‌ను పక్కనపెట్టి మహిళా కళాకారులు శంఖం, నాదస్వరం, నగద వంటి దేశీయ సాంస్కృతిక సంప్రదాయ వాయిద్వాలతో ఆవాహన కార‌్యక్రమాన్ని నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో నారీశక్తిని చాటేలా మహిళ సైనికులు చేసిన సాహస కృత్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేశాయి. ద్విచక్ర వాహనంపై త్రివిధ దళాలకు చెందిన మహిళ సైనికులు చేసిన విన్యాసాలు అతిథులను ఊపిరి బిగపట్టేలా చేశాయి. వైమానిక దళ ప్రదర్శన కూడా అబ్బురపరిచింది. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గగనతలంలో భారత శక్తిని చాటేలా వైమానిక దళం నిర్వహించిన ప్రదర్శన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బలాన్ని... చాటి చెప్పింది. ప్రదర్శనలో రెండు అపాచీ హెలికాఫ్టర్లు డకోటా విమానం చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. రెండు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కర్తవ్యపథ్‌లో తమ శక్తిని చాటాయి. ఆరు రాఫెల్ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు..... ఈ ప్రదర్శనలో పాల్గొని సత్తా చాటాయి. గగనతలంలో విభిన్న ఆకారాలను ఏర్పరుస్తూ సాగిన భారత వైమానిక దళ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నారీ శక్తిని చాటుతూ ద్వి చక్ర వాహనాలపై మహిళా సైనికులు చేసిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. ద్విచక్రవాహనంపై సాయుధ బలగాలకు చెందిన మహిళా సైనికులు చేసిన సాహస కృత్యాలు ప్రేక్షకులను ఊపిరిబిగపట్టేలా చేశాయి. మోటార్ సైకిళ్లపై 265 మంది మహిళలు... ధైర్యం పరాక్రమాన్ని ప్రదర్శించారు.
కర్తవ్యపథ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. వందే భారతం పేరుతో నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1500 మంది నృత్యకారులు 34 జానపద కళారీతులను ప్రదర్శించారు. 199 మంది గిరిజన, ఆదివాసీ నృత్యకారులు 399 మంది సాంప్రదాయ నృత్య కళాకారిణులు, 56 బాలీవుడ్ నృత్యకారిణులు..... ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చారు. సామూహిక నృత్య బృందాలు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ నృత్యాలు సాగాయి. కూచిపూడి, కథక్, భరత నాట్యం, ఒడిస్సీ, మణిపురి, మోహిని అట్టం కళారీతులను ప్రదర్శించారు.