New toll system: ఇక టోల్‌గేట్ల వద్ద క్షణం కూడా ఆగాల్సిన పనిలేదు..!
గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి..
ప్రయాణికులకు కేంద్ర మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుందని, దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వసూలుతో హైవే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోల్ వసూలు చేసి మంచి అనుభవాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థను 10 చోట్ల అమలులోకి తెచ్చామని, ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే హైవేలపై టోల్ కోసం వాహనాలను ఆపేవారు ఉండరని తెలిపారు. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. మన దేశంలోని హైవేలపై టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
“ఇప్పుడు ఉన్న టోల్ వ్యవస్థ అంతం అవుతుంది. ఇక టోల్ పేరుతో టోల్‌గేట్ వద్ద ఆపడానికి ఎవరూ ఉండరు. ఒక సంవత్సరంలోపు, దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేయబడుతుంది” అని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారతదేశంలోని రహదారుల అంతటా టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఏకీకృత, ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. NETCలో కీలక అంశం FASTag. ఇది వాహనం విండ్‌స్క్రీన్‌కు అతికించబడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID). దీన్ని స్కాన్ చేసి టోల్ ప్లాజా వద్ద యూజర్ లింక్డ్ ఖాతా నుంచి టోల్ చెల్లింపులను జరుపుతుంది. ఈ వ్యవస్థ మరింత మెరుగుపడి ప్రయాణికుల వేయింటింగ్ సమయాన్ని తగ్గిస్తుంది