PM Modi: ఈయూ ఒప్పదంతో ఆత్మవిశ్వాస భారత్‌లక్ష్యాలు సాకారం: ప్రధాని మోదీ

నాణ్యతతో యూరప్ మార్కెట్లను గెలుచుకోవాలని తయారీదారులకు సూచన

Update: 2026-01-29 06:45 GMT

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), "ఆశావహ, ఆత్మవిశ్వాస, ఆత్మనిర్భర్ భారత్" స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అన్నారు. 21వ శతాబ్దపు ఈ త్రైమాసికంలో భారతదేశం ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా, ఆకర్షణ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక, ప్రజాస్వామ్య బలంపై ప్రపంచానికి పెరుగుతున్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని తెలిపారు.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశానికి, ముఖ్యంగా యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. "భారత్, యూరప్ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినప్పుడు మన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు కేవలం పన్నుల తగ్గింపు గురించే ఆలోచించకూడదు. ఇది నాణ్యతను చాటుకోవాల్సిన గొప్ప అవకాశం. ఇప్పుడు మార్కెట్ మన కోసం తెరుచుకుంది. అత్యుత్తమ నాణ్యతతో యూరప్‌లోని 27 దేశాల హృదయాలను మనం గెలుచుకోవాలి. ఇది దీర్ఘకాలంలో మనకు ఎంతో మేలు చేస్తుంది" అని ప్ర‌ధాని వివరించారు. ఈ ఒప్పందం ద్వారా భారత రైతులు, యువత, సేవల రంగంలోని నిపుణులకు ప్రపంచ మార్కెట్లలో గణనీయమైన అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు

2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలనే సంకల్పంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్'పై వేగంగా ముందుకు సాగుతోందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతోందని తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరు "సంస్కరణ, పనితీరు, పరివర్తన" అనే సూత్రంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే, మానవతా దృక్పథాన్ని విస్మరించబోమని, చిట్టచివరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఒక గర్వకారణమైన క్షణమని అభివర్ణించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో చేసిన ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆకాంక్షలను ప్రతిబింబించిందని కొనియాడారు. దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎంపీలందరూ నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు.

Tags:    

Similar News