Khalistan Terrorist: ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హాజరు

స్పందించిన భారత విదేశాంగ శాఖ;

Update: 2025-01-25 00:15 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు.

జైస్వాల్ ప్రతివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ” మేము ఈ విషయాన్ని యూఎస్ ప్రభుత్వానికి లేవనెత్తాం. మా జాతీయ భద్రతను ప్రభావితం చేసే, భారతదేశానికి వ్యతిరేకమైన విషయాలను యూఎస్ సమర్థించడంపై ప్రశ్నించాం. ” అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా… జనవరి 20న.. కెనడా, అమెరికా ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించాడు. ఈ కార్యక్రమానికి ఖలిస్థానీ ఉగ్రవాదిని ఆహ్వానించలేదని, కాంటాక్ట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేశాడని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. వేడుకకు హాజరైన ప్రేక్షకులు ‘USA, USA’ అని నినాదాలు చేశారు. పన్నూ మాత్ర ఖలిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Tags:    

Similar News