Rajya Sabha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు;
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళా బిల్లుపై రాజ్యసభలో సుమారు 10 గంటలకు పైగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్ సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేలా.. వారికి 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. గురువారం రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. ఓటింగ్ సమయంలో పెద్దల సభలో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలపడంతో సులువుగా ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ ఓటింగ్ నిర్వహించారు.
ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మిగిలింది. అది లాంఛనమే కావడంతో బిల్లు త్వరలోనే చట్టంగా మారనుంది. అయితే, దీని ఫలాలు అందడానికి మాత్రం మహిళాలోకం 2029 వరకు నిరీక్షించాల్సిఉంది. జన గణన, నియోజకవర్గాల పునర్‌విభజన పూర్తయిన తరువాతే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయంటూ బిల్లులోకి పేర్కొనడమే దీనికి కారణం. రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గన్న ప్రతిపక్షాల సభ్యులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఒబిసి మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వకపోవడాన్ని కూడా పలువురు సభ్యులు తప్పుపట్టారు. రాజ్యసభలోసుదీర్ఘంగా దాదాపు పది గంటల పాటు చర్చ కొనసాగింది. సందేహాలకు సమాధానమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తోసిపుచ్చారు. ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. లోక్‌సభలో మాన్యువల్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించిన ప్రభుత్వం రాజ్యసభలో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఓటింగ్ నిర్వహించింది.
ఇక గురువారం జరిగిన చర్చ సందర్భంగా అధ్యక్ష స్థానంలో అధికసమయం మహిళలే కనిపించారు. సభ ప్రారంభం కాకముందే వైస్ ఛైర్మన్ ప్యానల్‌ను మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసం ప్రత్యేకంగా 13 మంది మహిళా సభ్యులతో ఛైర్మన్ జగ్‌దీప్ ధనఖర్ విస్తరించారు.
ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు రెండు సభల్లో ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు మాట్లాడినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు.