Vikram misry: పాక్ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను టార్గెట్ చేస్తోంది: విదేశాంగ కార్యదర్శి

పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగా జవాబు ఇస్తుంది- విక్రమ్ మిస్రీ;

Update: 2025-05-10 06:15 GMT

 భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై భారత ప్రభుత్వం అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రి స్పందించారు. పాక్ జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించుతోంది. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించారు. పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.

అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసమైందన్న వార్త అసత్యం. పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది. భారత ఆర్మీ బేస్‌లకు ఎటువంటి నష్టం జరగలేదు. జమ్ముకశ్మీర్‌లో అధికారి రాజ్ కుమార్ మరణం దురదృష్టకరం. రక్షణ వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. పాక్ తాజాగా ఓ ప్రకటన చేసింది. భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టు ప్రకటించింది. ‘ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్’ పేరుతో ఈ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. పాక్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ ఈ ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా పాక్ దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. భారత్ మాత్రం దీన్ని తగినట్లుగా ఎదుర్కొంటోంది. ఇప్పటికే నూర్ ఖాన్, మురిద్, షార్కోట్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు చేసినట్లు సమాచారం. పాక్ ఇప్పటికే ఒంటరిగా మిగిలిపోయింది. ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఈ దశలో, భారత్ దాడుల తీవ్రతను పాక్ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News