India Post : ప్రైవేట్ కొరియర్లకు చుక్కలే.. ఇండియా పోస్ట్ నుంచి బుల్లెట్ వేగంతో 24 స్పీడ్ పోస్ట్ సర్వీస్.
India Post : ఇకపై పోస్టాఫీస్ ద్వారా పంపే ముఖ్యమైన పార్శిళ్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగవంతమైన డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే పార్శిళ్లను నిర్దేశిత నగరాలకు చేర్చేలా 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త సర్వీస్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అత్యవసర పత్రాలు, మందులు లేదా విలువైన వస్తువులను వెంటనే పంపాలనుకునే వారికి ఈ సదుపాయం ఒక వరంలా మారనుంది.
ఈ ప్రతిష్టాత్మక సేవను మార్చి 17, 2026న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి ఢిల్లీలో ప్రారంభించనున్నారు. తొలుత ఈ సౌకర్యాన్ని దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో మన హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ఈ నగరాల మధ్య పార్శిళ్లు పంపేటప్పుడు 24 గంటల లోపు లేదా గరిష్టంగా 48 గంటల లోపు డెలివరీ అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పార్శిళ్లను ఎయిర్ మార్గం (విమానాల) ద్వారా ప్రాధాన్యత క్రమంలో రవాణా చేస్తారు.
భద్రత విషయంలోనూ ఇండియా పోస్ట్ రాజీ పడటం లేదు. డెలివరీ సమయంలో కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP) చెబితేనే పార్శిల్ అందజేసేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. దీనివల్ల వస్తువులు తప్పుదారి పట్టే అవకాశం ఉండదు. ప్రయాణిస్తున్న పార్శిల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్లు, ఆన్‌లైన్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. వ్యాపారుల కోసం బల్క్ ఆర్డర్లు ఉంటే ఇంటి నుంచే ఉచితంగా పికప్ చేసుకునే సౌకర్యం, బిఎన్‌పిఎల్ (BNPL - ఇప్పుడే పంపి తర్వాత డబ్బులు కట్టే విధానం) వంటి ఫీచర్లను కూడా చేర్చారు.
అన్నిటికంటే హైలైట్ విషయం ఏమిటంటే.. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పార్శిల్ డెలివరీ కాకపోతే, కస్టమర్లు తాము కట్టిన సొమ్మును రీఫండ్ (వాపస్) పొందే అవకాశం కూడా కల్పించారు. దీనివల్ల ఇండియా పోస్ట్ పట్ల ప్రజల్లో నమ్మకం పెరగడమే కాకుండా, ప్రైవేట్ కొరియర్ సంస్థలతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విప్లవంతో భారత తపాలా శాఖ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడమే కాకుండా, సామాన్యుడికి డిజిటల్ కాలంలో మరింత చేరువ కానుంది.