శక్తివంతమైన భూకంపాలతో గజగజలాడిన మయన్మార్, థాయిలాండ్‌కు కష్టకాలంలో సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. శుక్రవారమే అండగా ఉంటామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ చొరవ చూపించింది. మోడీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని మయన్మార్‌కు పంపించారు. భారత వాయు సేనకు చెందిన C130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, బ్యాంకాక్ గజగజ వణికిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 700 మంది చనిపోగా… వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.