జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగం విజయవంతం..
ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి శాటిలైట్;
అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్’ విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-16 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారుగా 2,393 కిలోగ్రాముల బరువున్న ‘నిసార్’ను భూమికి 745 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. శాటిలైట్ సేవలు ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు పడుతుందని ప్రకటించింది.
భూ ఉపరితలంలో వచ్చే మార్పులు, అంటార్కిటికాలో మంచు పలకల కదలికలు, పర్యావరణ మార్పులు, సముద్ర ప్రాంతాల్ని అధ్యయనం చేయటం ‘నిసార్’ మిషన్ ప్రధాన లక్ష్యం. భూమి ఉపరితలాన్ని అత్యంత కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. భూమిపై ఒక్క సెంటీమీటర్ మార్పులను కూడా గుర్తిస్తుంది. భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచవచ్చు. ప్రకృతి విపత్తులు, మానవ ప్రమేయంతో జరిగే వాటిని ఎదుర్కొనటంలో ప్రభుత్వాలకు ‘నిసార్’ డాటా కీలకం. భూ పరిశీలనపై ఇప్పటివరకు పంపిన శాటిలైట్లు ఒక ఎత్తు.. ‘నిసార్’ ఒక ఎత్తు.
ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ జీవితకాలం 5 ఏండ్లు. ఇందులోని వివిధ పరికరాలను నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నాసా, ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన రాడార్లలో అత్యంత శక్తివంతమైనది ‘నిసార్’. ఎల్-బ్యాండ్ రాడార్, హైస్పీడ్ డౌన్‌లింక్, జీపీఎస్ రిసీవర్ మొదలైనవి నాసా అందజేసింది.