IND vs AFG: సిరీస్‌పై కన్నేసిన టీం ఇండియా
ఆదివారం అఫ్గాన్‌తో రెండో టీ 20;
అఫ్గాన్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌పై భారత్ కన్నేసింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా... ఇందౌర్ వేదికగా జరగనున్న రెండో టీ-20లో గెలిచి సిరీస్ ఒడిసి పట్టాలని చూస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఇందౌర్ పిచ్‌పై చెలరేగాలని ఇరుజట్ల బ్యాటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్లాట్ పిచ్, బౌండరీలు చిన్నవి కావడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో... టాస్ గెలిచిన జట్టు మెుదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 2017లో ఇదే వేదికపై శ్రీలంకపై 260 పరుగులతో టీమిండియా టీ-20 చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది.
మెదటి మ్యాచ్‌లో సమన్వయం లోపంతో సున్నా పరుగులకే రనౌటైన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో గాడిన పడాలని చూస్తున్నాడు. టీ-20 ప్రపంచ కప్‌నకు ముందు కేవలం రెండు అంతర్జాతీయ టీ20ఉండడంతో సత్తాచాటాలని భావిస్తున్నాడు. మరోవైపు తొలి టీ20కి వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ రెండో టీ-20కు అందుబాటులో ఉండనున్నాడు. కోహ్లీ రాకతో హైదరాబాదీ యవ బ్యాటర్ తిలక్ వర్మపై వేటు పడనుంది.
గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన యశస్వి జైస్వాల్... జట్టులోకి వస్తే శుభమన్ గిల్‌పై వేటు పడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో రాణించిన..... శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకూ సింగ్ మరోసారి రాణించాలని చూస్తున్నారు. బౌలింగ్‌లో మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్‌లు తుది జట్టులో ఉండనున్నారు. పేస్ బాధ్యతలను ముఖేశ్ కుమార్, అర్షదీప్ పంచుకోనున్నారు.
మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక ఆటగాడు, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకపోయినా మెుదటి మ్యాచ్‌లో బలమైన భారత్‌కు పోటీనిచ్చింది. రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా.., ఆల్‌రౌండర్లు మహమ్మద్ నబి, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, గుల్బాదిన్ నయీబ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో బ్యాటింగ్.. విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. వీరిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నబీలతో కూడిన నాణ్యమైన స్పిన్ విభాగం అఫ్గాన్ సొంతం. తమదైన రోజున చెలరేగే ఫరూఖీ, నవీనుల్ హక్ లాంటి పేసర్లతో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. మెుదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడిన బౌలింగ్ రాణించినా అఫ్గాన్‌ఈ మ్యాచ్‌లో రాణించి భారత్ షాక్ ఇవ్వాలని చూస్తోంది.