Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చెక్ పెట్టాం: ఆర్మీచీఫ్ ఉపేంద్ర ద్వివేది
భారత్ సత్తా ఏంటో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు తెలిసింది..;
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలమట్టం చేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్ ఆడిందని పేర్కొన్నారు. మన శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో మనకు తెలియదు.. ఈ పరిస్థితినే గ్రేజోన్ అంటారు.. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. వారికి చెక్ పెట్టామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇక, ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో తాము ఉగ్ర స్థావరాలను సక్సెస్ ఫుల్ గా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్‌ను ఆ దేశ ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించారని ద్వివేది సెటైర్లు వేశారు. వాళ్లు యుద్ధంలో గెలిచినట్లు అక్కడి ప్రజలను భ్రమలో ఉంచి.. ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇచ్చారని ఎద్దేవా చేశాడు.