J & K: ఆర్మీ కోసం అద్భుతమైన కార్లు

ఐఐటీ జమ్ములో ప్రదర్శన..

Update: 2023-09-12 06:45 GMT

దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దులను మరింత పటిష్ఠం చేసే దిశగా సైన్యం.. కీలక చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి ఆయుధాల నవీకరణతో పాటు ఎలక్ర్టానిక్‌ యుద్ధ తంత్రాలను ఎదుర్కొనేందుకు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ఆత్మ నిర్భరతకు ప్రాధాన్యం ఇస్తూ.. స్వదేశీ సంస్థలతో కలిసి ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అలా తయారు చేసిన కొన్నింటిని భారత సైన్యం.. ఐఐటీ జమ్ములో ప్రదర్శించింది.

పాక్‌, చైనా కవ్వింపులు, ఉగ్రముప్పులను ఎదుర్కొనేందుకూ,. సరిహద్దులను మరింత పటిష్ఠం చేసేందుకూ.. భారత సైన్యం ఎన్నో చర్యలు చేపట్టింది. స్వదేశీ సాంకేతికతతో అధునాతన ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. రక్షణరంగంలో ఆత్మనిర్భరతకు ప్రాధాన్యత ఇస్తూ దేశీయ రక్షణ రంగఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ విధంగా తయారు చేసిన లైట్‌ స్పెషలిస్ట్‌ వెహికిల్స్‌ను తాజాగా ఐఐటీ జమ్ములో ప్రదర్శించింది.


ఈ లైట్‌ స్పెషలిస్ట్‌ వెహికిల్స్‌.. సరిహద్దు రక్షణలో కీలకపాత్ర పోషిస్తాయని నార్తన్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ LSVలకు యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్ లాంచర్స్‌, మీడియం మిషిన్‌ గన్స్‌, గ్రనైడ్‌ లాంఛర్స్‌ను అమర్చే వీలుంటుంది. తక్షణ ప్రతిస్పందన కోసం ఈ LSVలను వేగంగా అవసరమైన ప్రాంతాలకు తరలించవచ్చు. లద్దాఖ్‌ వంటి పర్వత ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా తరలించవచ్చు.

యుద్ధ క్షేత్రంతో పాటు కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్ల కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధ వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని నార్తన్‌ కమాండ్‌ తెలిపింది. ఆయుధ వ్యవస్థల తయారీకి 190కి పైగా స్వదేశీ సంస్థలను ఇందులో భాగం చేసుకున్నామనీ అందులో 60కిపైగా అంకురసంస్థలు ఉన్నట్లు వివరించింది. 2022 మే నుంచి ఉత్తర సరిహద్దుల్లో 256 రకాల యుద్ధ పరికరాలను ఇండెక్ట్‌ చేసినట్లు నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌.. లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. పాక్‌ నుంచి డ్రోన్లు ప్రవేశిస్తున్న వేళ.. కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు వివరించారు. LOC వెంట ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్‌ను పటిష్టం చేస్తున్నామని, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు 

Tags:    

Similar News