Sanjay Verma: కెనడాపై మండిపడ్డ భారత రాయబారి సంజయ్ వర్మ
కెనడాలో ట్రూడో క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నారని వ్యాఖ్య;
భారత్-కెనడా మధ్య సంబంధాలు పతనం కావడం ఊహించనిదని హైకమిషనర్‌గా పని చేసిన సంజయ్ వర్మ వెల్లడించారు. భారత్‌పై కెనడా ఇటీవల ప్రవర్తించిన తీరు చాలా అసహ్యంగా ఉందని మండిపడ్డారు. స్నేహపూర్వక ప్రజాస్వామ్యంగా భావించిన దేశం భారత్‌ను వెన్నుపోటు పొడిచిందన్నారు. అత్యంత అనైతికంగా ప్రవర్తించిందన్నారు.
భారత్‌ను కెనడా వెన్నుపోటు పొడిచిందని అక్కడ హైకమిషనర్‌గా సేవలందించిన సంజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇటీవల ప్రవర్తించిన తీరు అత్యంత అనైతికంగా ఉందని వర్మ పేర్కొన్నారు. స్నేహపూర్వక ప్రజాస్వామ్యంగా భావించిన దేశం, భారత్‌ను వెన్నుపోటు పొడిచిందని, అత్యంత అనైతికంగా ప్రవర్తించిందని చెప్పారు. ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు పతనం కావడం ఊహించనిదన్నారు. కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రజాదారణ కోల్పోతున్నారన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ట్రూడో గెలవడం చాలా కష్టమన్నారు.
"భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినేలా కెనడా ప్రవర్తించింది. అక్కడ మేము ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు చేపట్టలేదు. కానీ, భారత్‌పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు ఆ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఆ దేశం చూపించలేకపోయింది. ఆ దేశంలో న్యాయవ్యవస్థ సున్నితంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అందుకే అక్కడ ఖలిస్థానీలు ఆశ్రయం పొందుతున్నారు. కెనడాలో అతి తక్కువ సంఖ్యలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారు. మిగిలిన సిక్కు కుటుంబాలను వారు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనేక అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. గురుద్వారాల ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు" అని సంజయ్ వర్మ విమర్శించారు.
మరోవైపు, ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గంతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేశాయి. అయితే అందుకు తగిన ఆధారాలను చూపించలేదు. ఈ క్రమంలోనే కెనడాలోని దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. పోలీసు విచారణలో భారత హైకమిషనర్ పాల్గొనాలని కెనడా కోరిందని, అందుకే మన హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించామని విదేశాంగ మంత్రి ఇటీవల ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాయబారి సంజయ్ కుమార్ వర్మ తిరిగివచ్చారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెనడా విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.