Indian Navy: భారత నౌకాదళం స్వదేశీకరణలో మరో మెట్టు

విశాఖలో ‘ఆండ్రోత్’ నౌక జాతికి అంకితం

Update: 2025-10-06 01:15 GMT

భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో మరో మైలురాయిని అధిగమించింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం భారత నౌకాదళానికి చెందిన రెండో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) నౌక 'ఆండ్రోత్‌'ను వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధర్కర్ జాతికి అంకితం చేశారు. సముద్రంలో శత్రు జలాంతర్గాముల భద్రతాపరమైన కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఈ నూతన నౌకను రూపొందించారు.

ఆండ్రోత్ అనే పేరును లక్షద్వీప్ ద్వీప సమూహంలోని ఒక ద్వీపం నుంచి ఎంపిక చేశారు. ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (GRSE) సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది.

ఇటీవలి కాలంలో భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌకలైన అర్నాలా, నిస్తార్, ఉదయగిరి, నీలగిరి ప్రవేశించగా, తాజాగా ఆండ్రోత్ కూడా చేరడంతో సముద్ర భద్రతలో భారత నౌకాదళం మరింత బలోపేతం అవుతోంది.

ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధర్కర్ మాట్లాడుతూ, "స్వదేశీకరణ దిశగా ఇది భారత నౌకాదళానికి ఒక కీలక ముందడుగు. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది," అని అన్నారు. 

Tags:    

Similar News