Indian Navy: హౌతి క్షిపణి దాడులు.. 21 మందిని రక్షించిన భారత్
మన నేవీ మరో డేరింగ్ ఆపరేషన్;
గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో బుధవారం హూతీ రెబల్స్ దాడి చేసిన ఓడ నుంచి 21 మందిని రక్షించిన దృశ్యాలను.. ఇండియన్ నేవీ విడుదల చేసింది. దాడి తర్వాత సకాలంలో స్పందించిన భారత నౌకాదళం.. 2 హెలికాప్టర్ల సాయంతో అత్యంత సాహసోపేతంగా నౌకలోని సిబ్బందిని రక్షించింది. హూతీలు ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న క్రమంలో వాటిని రక్షించేందుకు రంగంలోకి దించిన INS కోల్‌కతా యుద్ధనౌక సాయంతో భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.
గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లోని బార్బడోస్ జెండాతో ఉన్న ఎంవీ ట్రూస్ కాన్ఫిడెన్స్ అనే వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించిన దృశ్యాలను భారత నేవీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకుంది. వాణిజ్య నౌకలపై హూతీ రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వాటిని అరికట్టేందుకు మోహరించిన INS కోల్‌కతా యుద్ధనౌక సాయంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
డ్రోన్ లేదా క్షిపణితో హూతీలు దాడి చేశారన్న సమాచారం తెలియగానే గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో 55 నాటికల్ మైళ్ల దూరంలోని ఘటనాస్థలికి వెళ్లిన ఇండియన్ నేవీ బృందం.. సహాయక చర్యలు చేపట్టింది. హౌతీల దాడిలో నౌకలో అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు అమెరికా సైన్యం తెలిపింది. తగలబడుతున్న ఓడ నుంచి తీవ్రంగా గాయపడ్డ పలువురిని భారత నేవీ కాపాడింది. ఇందుకు యుద్ధనౌకలోని 2 హెలికాప్టర్లు, కొన్ని చిన్న బోట్లను ఉపయోగించింది. ఒక భారతీయుడితో పాటు మొత్తం 21 మందిని ఎంవీ ట్రూస్ ఓడ నుంచి ఖాళీ చేయించి.. వైద్య సహాయం అందించింది. ప్రస్తుతం అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడులకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. కొన్ని వారాలుగా ఈ దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ హిందూ మహాసముద్రంలోని వివిధ వాణిజ్య నౌకలకు సహాయం అందించడంలో భారత నౌకాదళం చురుకుగా పాల్గొంటోంది.