Chandrayan : ఈ సాయంత్రానికి చంద్రుని కక్ష్య లోకి..
ఆగస్టు 23 నాటికి చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విక్రమ్ ల్యాండర్;
చంద్రునిపై పరిశోధనలకు ఇస్రో పంపిన చంద్రయాన్-3 మరో కీలక ఘట్టానికి దగ్గరవుతోంది. ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకుని చంద్రుని దిశగా వెళ్తున్న ఈ వ్యోమనౌక మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకుందని, శనివారం చంద్రుని కక్ష్యలోకి అడుగుపెట్టనుందని ఇస్రో ప్రకటించింది. దీన్ని చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను శనివారం రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. చంద్రయాన్-3 జాబిల్లికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది.అనంతరం ఈ నెల 23వ తేదీన సాయంత్రం జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. అందులోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రునిపై పరిశోధనలు చేయనుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం.. జులై 14న చంద్రయాన్-3ని లాంచ్ చేసింది ఇస్రో. ఈ లాంచ్‌ను యావత్ భారత దేశం చాలా ఆసక్తిగా తిలకించింది.మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచుకుంటూ వచ్చింది ఇస్రో. ఆగస్ట్ 1న.. ఈ స్పేస్‌క్రాఫ్ట్.. భూమి కక్ష్యను వీడి చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన పలు వివరాలను దేశ ప్రజలతో ఎప్పటికప్పుడు పంచుకుంది ఇస్రో. ఇక ఇప్పుడు చంద్రయాన్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.
అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ మార్గంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ వ్యోమనౌక ప్రస్తుతం చంద్రుడి దిశగా ప్రయాణించి నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. చంద్రుడి కక్ష్యలోకి చేరిన తరువాత ప్రొపల్షన్ మొడ్యూల్ నుంచి ల్యాండర్ వేరు అవుతుంది. ఆ తరువాత అది చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. అనంతరం, ల్యాండర్ నుంచి ర్యాంప్ మీదుగా ఆరు చక్రాల రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వెళ్తుంది. అక్కడ 14 రోజుల పాటు కలియతిరుగుతూ భూమి పైకి హై రెసొల్యూషన్ ఫొటోలను పంపుతుంది.
చంద్రయాన్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా ఇస్రో ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది . మొదటి ప్రయోగమైన చంద్రయాన్ 1 విజయవంతమైంది. 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది. జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్‌వేర్‌ను అప్డేచ్ చేసి, చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవనుంది.