GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ 20 శాటిలైట్

అమెరికాలో ఇస్రో జీ శాట్ 20 ప్రయోగం విజయవంతం.. స్పేస్ ఎక్స్ రాకెట్ తో నింగిలోకి;

Update: 2024-11-19 00:45 GMT

వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ఘనతను సాధించింది. అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రూపొందించిన ఫాల్కన్‌-9 రాకెట్‌.. ఈ జీశాట్‌-20ను నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా జరిగిన ఈ ప్రయోగం కొత్త శకానికి నాంది పలికింది. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి.

ఇంటర్నెట్ సేవలం..

జీశాట్‌-ఎన్‌2 లేదా జీశాట్‌-20గా పిలిచే ఈ ఉపగ్రహం భారత్‌లో ఇన్‌-ఫ్లైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించనుంది. ప్రస్తుతానికి దేశంలో ఇన్‌-ఫ్లైట్‌ ఇంటర్నెట్‌ యాక్సె్‌సపై నిషేధం ఉంది. ఈ సేవలను అందిస్తున్న విమానయాన సంస్థలు కూడా భారత గగనతలం మీదుగా ప్రయాణించే సమయంలో వాటిని నిలిపివేయాలి. అయితే భారత గగనతలంపై 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ప్రయాణికులు వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ఈ నెల 4న ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఈ నేపథ్యంలో జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. ఇన్‌-ఫ్లైట్‌ ఇంటర్నెట్‌ సేవలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇస్రో ప్రయోగిస్తున్న ఈ శాటిలైట్‌ జీవితకాలం 14 సంవత్సరాలు. భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో సైతం అత్యాధునిక కమ్యూనికేషన్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు రూ.590 కోట్లు చేస్తున్నట్టు అంచనా.

స్పేస్ ఎక్స్‌ రాకెట్‌ ఎందుకంటే..?

భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలంటే ఇస్రో.. తన సొంత ప్రయోగ వాహనం మార్క్‌-3 రాకెట్‌ను రంగంలోకి దించుతుంది. బాహుబలిగా పేరుగాంచిన ఈ రాకెట్‌ 4,000 కేజీల బరువున్న భారీ శాటిలైట్లను సైతం మోసుకెళ్లగలదు. అయితే ఇస్రో తాజాగా సిద్ధం చేసిన జీశాట్‌-ఎన్‌2 బరువు దాదాపు 4,700 కేజీలు. గతంలో ఇలాంటి భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం ఫ్రెంచ్‌ సంస్థ ఏరియన్‌ స్పేస్‌పై ఇస్రో ఆధారపడింది. ప్రస్తుతం ఆ కంపెనీ వద్ద ఇలాంటి ఆపరేషనల్‌ రాకెట్లు లేవు. అలాగే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా సేవలను పొందే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భారీ రాకెట్లను ప్రయోగించగల స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ను ఇస్రో ఎంచుకుంది.

Tags:    

Similar News