IndiGo Flight: ఇండిగో విమానంలో భారీ కుదుపులు
పరిస్థితిని వీడియో తీసిన ప్రయాణికుడు;
మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 (రిజిస్ట్రీ VT-IMD) మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఢిల్లీ, శ్రీనగర్ మధ్య విమానంపై వడగళ్ల వర్షం పడింది. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది.పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. శ్రీనగర్‌కు సమాచారం అందించాడు. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఆ విమానంలో మొత్తం 227 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ పైలట్, సిబ్బంది చాకచక్యం వల్ల మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, విమానం ముక్కు భాగం దెబ్బతింది.
విమానం లోపల ఉన్న ఓ ప్రయాణీకుడు తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వడగళ్ళు ఫ్యూజ్‌లేజ్‌ను తాకుతున్నట్లు, దీనివల్ల క్యాబిన్ షేక్ అవుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. విమానంలోని ప్రయాణికుల అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విమానాన్ని “ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్” (AOG)గా ప్రకటించేంతగా నష్టం వాటిల్లింది. దీనిని అత్యవసర మరమ్మతుల నిలిపేశారు.