IndiGo Crisis: సమసిపోని సంక్షోభం, ఇండిగో సంస్థపై చర్యలకు, జరిమానాకు సిద్ధమైన ప్రభుత్వం!

ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు.. ?

Update: 2025-12-07 02:30 GMT

 దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజు శనివారం కూడా కొనసాగింది. ఇండిగోకు చెందిన వందలాది విమానాలు శనివారం కూడా రద్దు కాగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు పడుతూ అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

పైలట్ల కొరత కారణంగా సంక్షోభం ఏర్పడినట్లు ఇండిగో చెబుతున్నప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించినా పరిస్థితి అదుపులోకి రావడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. శనివారం దేశవ్యాప్తంగా ఇండిగోకు చెందిన 850 విమానాలను రద్దు అయ్యాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు మరో నాలుగు విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. డిసెంబర్‌ 7వ తేదీ(ఆదివారం) రాత్రి 8 గంటల లోపల ప్రయాణికులకు టికెట్ల డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ శనివారం ఇండిగోను ఆదేశించింది. టికెట్ల ధరలపై పరిమితిని విధిస్తున్నట్లు కేంద్రం మరో ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 37 ప్రధాన రైళ్లలో 116 అదనపు బోగీలను ప్రవేశపెట్టినట్లు భారతీయ రైల్వేలు ప్రకటించాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగోకు చెందిన 106 విమానాలు రద్దు కావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇండిగో నిర్వహణా సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ చెబుతున్నప్పటికీ విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రీ బుకింగ్‌ చేసుకునేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడింది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న కారణంగా విమానాలు నడపడం ఇండిగోకు కష్టతరంగా మారింది. చెన్నై విమానాశ్రయం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. మెట్రో రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్‌ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పుణెలో 42 విమానాలు రద్దు కాగా, అహ్మదాబాద్‌లో 19, తిరువనంతపురంలో 3 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ఇండియన్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ జాదవ్‌ మాట్లాడుతూ, ఈ సంక్షోభానికి బాధ్యత ఇండిగో యాజమాన్యానిదేనని ఆరోపించారు. పైలట్ల బాధ్యత లేదని చెప్పారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మద్దతు యాజమాన్యానికే ఉందన్నారు. డీజీసీఏ, ఇండిగోలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News