Indigo Airlines: రూ.610 కోట్ల రిఫండ్ లు చెల్లించిన ఇండిగో..కానీ

900 మంది పైలట్లు సమకూరుతారా

Update: 2025-12-08 00:30 GMT

విమానయాన సంస్థ ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు చెల్లించాల్సిన రిఫండ్‌లను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించ డంతో ఇప్పటివరకు సుమారు రూ. 610 కోట్లను ప్రయాణికులకు రిఫండ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాల రద్దు కారణంగా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే వారి నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికులకు తక్షణమే సహాయం అందించేందుకు, రిఫండ్, రీబుకింగ్ సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ జోక్యంతో ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతోందని, విమానాల షెడ్యూల్స్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 706 విమానాలు నడపగా, శనివారానికి ఆ సంఖ్య 1,565కు పెరిగింది. ఆదివారం చివరి నాటికి 1,650కి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతర దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలు సజావుగా పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపింది.

ఇండిగో విమానాల రద్దుతో పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు అమాంతం పెరగడంతో, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలపై పరిమితి విధించింది. ఈ చర్యతో ప్రభావిత మార్గాల్లో ఛార్జీలు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. అదేవిధంగా, ప్రయాణికుల నుంచి వేరుపడిన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి అందజేయాలని ఆదేశించగా, శనివారం నాటికి 3,000 బ్యాగులను ఇండిగో డెలివరీ చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ప్రధాన విమానాశ్రయాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్లు ధృవీకరించారు.

ఫిబ్రవరి 10 నుంచి పైలట్లు, క్రూ సిబ్బందికి నూతన నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నందున.. భారీగా పైలట్లను నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టింది. 2026 ఫిబ్రవరి 10కి 158 మందిని, 2026 డిసెంబరు కల్లా మరో 742 మంది (మొత్తం 900 మంది) పైలట్లను నియమించుకుంటామని ఇండిగో ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. వచ్చే 12 నెలల్లో 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్‌ ఫస్ట్‌ అధికారులను నియమించుకుంటామని డీజీసీఏకు సంస్థ హామీ ఇచ్చింది. ప్రస్తుతం సంస్థ వద్ద 400కు పైగా విమానాలుండగా, కొత్తగా మరిన్ని జతచేరనుండటం.. రాత్రిపూట సర్వీసులను సంస్థ అధికంగా నిర్వహిస్తుండటం వల్లే, ఇంత భారీగా పైలట్లు కావాల్సి వస్తోంది.

ప్రభుత్వ వేగవంతమైన చర్యలతో దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలు వేగంగా స్థిరపడుతున్నాయని, పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.

Tags:    

Similar News