Indian Navy: నడిసంద్రంలో నావను రక్షించిన నేవీ

30 గంటలు శ్రమించి ఒడ్డుకు లాకొచ్చారు

Update: 2023-07-29 05:30 GMT

చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో రెండు రోజుల పాటు చిక్కుకున్న 36 మంది మత్స్యకారుల ను భారత నౌకాదళ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఐఎన్‌ఎస్‌ ఖంజర్‌ సహాయంతో 30 గంటలపాటు శ్రమించి మత్స్యకారుల పడవలను తీరానికి లాక్కొచ్చారు. తమిళనాడు లోని నాగపట్టణం తీరం నుంచి 36 మంది మత్స్యకారులు మూడు పడవల్లో ఇటీవల చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో పాటు ఇంధనం లేకపోవడం, ఇంజిన్‌ సమస్య తలెత్తడంతో వీరి పడవలు సముద్రం మధ్యలో నిలిచిపోయాయి. అలా రెండు రోజుల పాటు వారు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు.

మత్స్యకారుల చిక్కుకున్నట్లు సమాచారం రాగానే నౌకాదళం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్‌ఐఎస్‌ ఖంజర్‌ను సహాయక చర్యలకు పంపింది. వీరు మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టగా తమిళనాడు తీరానికి దాదాపు 130 నాటికల్‌ మైళ్ల దూరంలో మూడు పడవలు కన్పించాయి. వెంటనే నౌకాదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ మూడు బోట్లకు తాళ్లు కట్టి 30 గంటలకు పైగా లాక్కుంటూ చెన్నై హార్బర్‌కు తీసుకొచ్చారు. మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని నేవీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

మరోవైపు బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం నిన్న పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Tags:    

Similar News