PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్య

Update: 2025-10-20 07:00 GMT

ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు (పాకిస్థాన్) నిద్రపట్టదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గోవా తీరంలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ దృశ్యం తన జీవితంలో ఎఫ్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

నాకు ఒకవైపు మహాసముద్రం.. మరోవైపు భారత సైన్యం నిల్చోవడం గర్వంగా అనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు.. సైనికుల చేత వెలిగిన దీపాల కాంతి వలె దివ్యంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌ సందర్భంగా కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్‌ను మన మోకాళ్ల మీద పడేలా చేసిందని గుర్తుచేశారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదని.. ఇది 21వ శతాబ్దపు భారత కృషికి, ప్రతిభకు, నిబద్ధతకు ప్రతీక అని వెల్లడించారు.

ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7వ తేదీన భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు సమన్వయంగా పనిచేసి.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని అనేక ఉగ్ర స్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయని మోదీ గుర్తుచేశారు. త్రివిధ దళాల సమన్వయం పాక్‌ను ఓటమి ఒప్పుకునేలా చేసిందని అన్నారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ఏటా సరిహద్దుల్లోని సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి, దళాలతో సరదాగా గడిపి వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో తొలిసారిగా సియాచిన్ సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News